తీరిక లేకుండా కండక్టర్ ఉద్యోగం. పెద్ద పెద్ద అకాడమీల్లో శిక్షణ పొందలేదు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు ఉన్న వనరులతోనే సివిల్స్ వైపు సాగిపోతున్నాడో యువ కండక్టర్. దూరవిద్యలో డిగ్రీ, పీజీలు చేసి సివిల్స్ పరీక్షల్లో మెయిన్స్‌ను అధిగమించాడు.
కర్ణాటక, యశవంతపుర: పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చని నిరూపించే పనిలో ఉన్నారు బస్సు కండక్టర్ ఒకరు. మండ్య జిల్లా మళవళ్లికి చెందిన ఎన్‌సీ మధు బెంగళూరులోని కొత్తనూరు 34వ బీఎంటీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నాడు. తన 19 ఏటనే కండక్టర్ కొలువు సాధించాడు. చదువు అంటే ఎంతో ఇష్టం కావడంతో మధు ఐఏఎస్ కావాలని కలగన్నాడు. అందుకోసం దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీని పూర్తి చేశాడు. 2014లో కేఎఎస్, 2018, 2019లో యుపీఎస్‌సీ పరీక్షలను రాశాడు. 2019లో కన్నడ మాధ్యమంలో సివిల్స్ రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. రాజనీతి శాస్త్రం, జనరల్ స్టడీస్‌ను ఎంపిక చేసుకొని రాసిన మెయిన్స్ పరీక్షల్లో పాసై ఇంటర్వ్యూకు ఎంపిక కావడం విశేషం. మార్చి 25న ఢిల్లీలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇంటర్వ్యూలో పాసైతే కలెక్టర్ లేదా ఎస్పీ ఏదైనా సాధించినట్లే.